Heavy Rains Telangana: మరో రెండు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు

Heavy Rains Telangana: Heavy to very heavy rains for another two days

Non-Stop Rain In Telangana : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలను చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఆకాశానికి చిల్లులు పడ్డాయా అనిపించక మానదు. కొన్ని రోజులుగా కురుస్తున్న నాన్‌ ‌స్టాప్‌ ‌వర్షాలతో జన జీవనం అస్థవ్యస్థంగా మారింది. సామాన్య ప్రజలు తమ వ్యాపారాలను కొనసాగించలేక పోతున్నారు. అదే విధంగా ఇంట్లో వారు ఇంటి నుండి బయట వెల్లలేని పరిస్థితి నెలకొంది. రోజు కూలీలపై వర్షాల ప్రభావం తీర్వంగానే ఉంది. తెలంగాణపై మేఘ గర్జన మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

2021, సెప్టెంబర్ 07వ తేదీ మంగళవారం, సెప్టెంబర్ 08వ తేదీ బుధవారం అతి భారీ వర్షాలు కురుస్తాయన్నది అధికారుల అంచనా. మంగళవారం ఐదు జిల్లాల‌కు, బుధవారం నాలుగు జిల్లాల‌కు రెడ్ అల‌ర్ట్ హెచ్చరిక జారీ చేశారు. పెద్దప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖ‌మ్మం జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని సూచించింది. మిగ‌తా జిల్లాల్లో ఈ రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. తెలంగాణలో కురిసిన కుండపోత వర్షానికి పలు జిల్లాలు జలమయమయ్యాయి.

మూడు రోజుల జోరు వాన, ముసురుతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలను వర్ష బీభత్సం కొనసాగుతోంది. వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో కుండపోతకు రోడ్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. సింగరేణి ఓపెన్ కాస్టు గనుల్లో రెండు రోజుల నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి.

దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పశువులను మేతకు వదలవద్దని, వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు సూచించారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More